హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను మిషన్ మోడ్‌లో వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎం, ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోడౌన్లకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను వినియోగించుకోవాలని చెప్పారు. రశీదు వెంటనే రైతులకు అందేలా చర్యలు తీసుకుంటే తాలు, తరుగు వంటి అక్రమాలు నివారించవచ్చని పేర్కొన్నారు.
లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలని, అవసరమైన రవాణా వనరులు అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. కాంట్రాక్టర్లు సరైన లారీలను అందించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు.
గోదాముల కొరత ఉన్న ప్రాంతాల్లో తాత్కాలికంగా రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో పరిస్థితిని బట్టి జిల్లా కలెక్టర్లు బాధ్యతతో వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని సీఎం ఆదేశించారు. అవసరమైతే పోలీస్ సహాయం తీసుకుని సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని సూచించారు.
అకాల వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, వాతావరణ శాఖ సూచనల ఆధారంగా రైతులను అప్రమత్తం చేయడానికి మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. ప్రతి ఐకేపీ కేంద్రం, ప్రతి రైస్ మిల్లుకు ఒక బాధ్యతాయుత అధికారి నియమించాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.








