TVK government: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపై కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం తొలి రోజుల్లోనే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కీలక పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. తనకు విశ్వసనీయులైన వారికి ముఖ్యమైన పదవులు అప్పగిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని వేగవంతం చేస్తున్నారు.
అదే సమయంలో టీవీకే పార్టీ క్యాడర్‌కు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. రహదారులపై, ప్రజా ప్రదేశాల్లో ఎలాంటి బ్యానర్లు, పోస్టర్లు, వ్యక్తిగత వేడుకల ప్రదర్శనలు చేయకూడదని స్పష్టం చేసింది. ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించే కార్యక్రమాలు పూర్తిగా నిషేధించినట్లు తెలిపింది.
ముఖ్యమంత్రి విజయ్, మంత్రులు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేసే బ్యానర్లు కూడా రోడ్లపై కట్టినా కఠిన చర్యలు తప్పవని పార్టీ స్పష్టం చేసింది. పార్టీ శ్రేణులు ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించింది. ప్రజల నుంచి విశ్వాసం పొందిన పార్టీగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నాయకత్వం ఆదేశించింది.
పుట్టినరోజులు, కుటుంబ వేడుకలు వంటి సందర్భాల్లో కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేయకూడదని పార్టీ హెచ్చరించింది. పార్టీ నిబంధనలను ఉల్లంఘించినా, రోడ్లపై హంగామా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ తెలిపారు. ఈ నిర్ణయాలు పార్టీ అధినేత ఆమోదంతో తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
TVK government | రోడ్లపై ఒక్క బ్యానర్లు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవు…సీఎం విజయ్ స్ట్రాంగ్ వార్నింగ్
-








