Annamalai Resigns: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలో కొత్త సమీకరణాలు ఏర్పడుతుండటంతో ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య ఏఐఏడీఎంకేలోని ఒక వర్గం టీవీకేకు మద్దతు ప్రకటించడం, ప్రభుత్వానికి బయటి నుంచి సహకారం అందించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని సందర్భాల్లో ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఫ్లోర్ టెస్ట్‌లో కూడా టీవీకేకు అనుకూలంగా ఓటు వేసినట్లు సమాచారం. ఈ పరిణామాల ప్రభావం బీజేపీపై కూడా పడినట్లు తెలుస్తోంది.
తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై సొంత పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ప్రచారం గత కొంతకాలంగా కొనసాగుతోంది. దక్షిణ తమిళనాడులో ఆయనకు మద్దతుగా పోస్టర్లు, బ్యానర్లు కూడా వెలవడటం ఈ ఊహాగానాలకు మరింత బలం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో అన్నామలై తన బీజేపీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు అందజేశారు. అనంతరం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అంతకుముందు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో కూడా ఆయన సమావేశమైనట్లు సమాచారం. అన్నామలై పార్టీకి దూరంగా ఉండటంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది.
నైనార్ నాగేంద్రన్‌ను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం తగ్గించారు. సొంత రాజకీయ మార్గం ఎంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.








