ICC మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌లో ప్రధాన మార్పులను అమలు చేసింది. శ్రీలంకలో జరగాల్సిన ఈ టోర్నీని మొదట జూన్–జూలై నెలల్లో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, తాజాగా దానిని ఫిబ్రవరి నెలకు మార్చినట్లు ఐసీసీ వెల్లడించింది.
అహ్మదాబాద్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఐసీసీ ఆమోదం తెలిపింది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. షెడ్యూల్ మార్పుకు గల కారణాలను మాత్రం ఐసీసీ వెల్లడించలేదు. ఈ మార్పు కారణంగా న్యూజిలాండ్–ఆస్ట్రేలియా మహిళల సిరీస్ షెడ్యూల్‌లో కూడా స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది.
అదే సమావేశంలో 2028 మహిళల టీ20 ప్రపంచకప్ అర్హత మార్గాన్ని కూడా ఐసీసీ ఖరారు చేసింది. పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో భారత్ తన మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడనుంది. 12 జట్లతో జరిగే ఈ ప్రపంచకప్‌లో 10 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి.
2026 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టాప్-8లో నిలిచిన జట్లు, ఆతిథ్య దేశం, అలాగే 2026 జూలై 6 నాటికి ఉన్న ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా మరికొన్ని జట్లు నేరుగా ప్రవేశం పొందుతాయి.
మిగిలిన రెండు స్థానాలను గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా భర్తీ చేస్తారు. ఐసీసీ ఛైర్మన్ జయ్ షా మాట్లాడుతూ, ప్రపంచ క్రికెట్ అభివృద్ధి, సమాన అవకాశాలు, సమర్థవంతమైన నిర్వహణపై సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల క్రికెట్‌తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల క్రికెట్‌ను బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక టెస్ట్ క్రికెట్‌లో కూడా ఐసీసీ కొత్త ప్రయోగానికి ఆమోదం తెలిపింది.
వెలుతురు సమస్యల కారణంగా ఆట ఆగిపోకుండా ఉండేందుకు అవసరమైన సందర్భాల్లో పింక్ బాల్ వినియోగాన్ని అనుమతించింది. ఇప్పటివరకు డే–నైట్ టెస్టుల్లో మాత్రమే ఉపయోగిస్తున్న పింక్ బాల్‌ను ఇకపై డే టెస్టుల్లోనూ ప్రయోగాత్మకంగా ఉపయోగించనున్నారు.








