Telangana Government: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (NEHS)ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా NEHS వెబ్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులు, ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌కు సంబంధించిన పత్రాలను ఆవిష్కరించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 4.39 లక్షల మంది ఉద్యోగులు, 3.62 లక్షల మంది పెన్షనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 17.88 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. వీరికి 114 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 886 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అపోలో, యశోద, కిమ్స్, కేర్, స్టార్ వంటి ప్రముఖ ఆసుపత్రులు కూడా ఈ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. సీజీహెచ్ఎస్ ధరలకు అనుగుణంగా 1,816 చికిత్సా ప్యాకేజీలను ఇందులో చేర్చారు.
పథకం నిర్వహణ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు తమ ప్రాథమిక వేతనం లేదా పెన్షన్‌లో 1.5 శాతం చొప్పున చెల్లించగా, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని తన వంతుగా జమ చేయనుంది. నిధుల నిర్వహణ కోసం ప్రత్యేక ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు NEHS పోర్టల్ ద్వారా డిజిటల్ హెల్త్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత పథకంలోని లోపాలను సరిదిద్దుతూ ఉద్యోగ సంఘాల సూచనలతో ఈ కొత్త విధానాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా క్యాష్‌లెస్ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
Telangana Government | తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. కొత్త హెల్త్ కార్డులతో 886 ఆస్పత్రుల్లో చికిత్స
-








