SpaceX: ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ తన భారీ రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగాన్ని వాయిదా వేసింది. ముందుగా నిర్ణయించిన తేదీకి బదులుగా ఇప్పుడు ఈ ప్రయోగాన్ని మే 22న భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిర్వహించనుంది.
ఈ ప్రయోగం అమెరికాలోని దక్షిణ టెక్సాస్‌లో ఉన్న స్టార్‌బేస్ కేంద్రం నుంచి జరగనుంది. కొత్త వాహనంపై తుది భద్రతా పరీక్షలు పూర్తి చేసేందుకు అదనపు సమయం అవసరమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
స్టార్‌షిప్ అనేది మనుషులు, భారీ సరుకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు రూపొందించిన పూర్తిగా మళ్లీ ఉపయోగించగల స్పేస్‌క్రాఫ్ట్ వ్యవస్థ. ఇది ఇప్పటివరకు నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాకెట్‌గా గుర్తింపు పొందింది.
ఇందులో సూపర్ హెవీ బూస్టర్, పైభాగంలో స్టార్‌షిప్ వాహనం ఉంటాయి. ఈ రెండు భాగాలను తిరిగి భూమికి సురక్షితంగా దింపి మళ్లీ ఉపయోగించడం ద్వారా అంతరిక్ష ప్రయాణ ఖర్చులను తగ్గించడమే స్పేస్ఎక్స్ లక్ష్యం.
ఈసారి జరగనున్న ప్రయోగం వర్షన్ 3 స్టార్‌షిప్, సూపర్ హెవీకి తొలి టెస్ట్ ఫ్లైట్ కానుంది. ఇందులో మరింత శక్తివంతమైన ఇంజిన్లు, పెద్ద ఇంధన ట్యాంకులు, మెరుగైన కంట్రోల్ ఫిన్స్ వంటి అప్గ్రేడ్లు చేశారు.
అలాగే కొత్తగా రూపొందించిన లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ మొదటిసారి ప్రయాణం ప్రారంభించనుంది. ప్రయోగం అనంతరం బూస్టర్ సముద్రంలో ల్యాండ్ అవుతుండగా, స్టార్‌షిప్ భాగం పరీక్షా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది.
గత ప్రయోగాల ద్వారా స్పేస్ఎక్స్ అనేక సాంకేతిక పాఠాలు నేర్చుకుని రాకెట్ డిజైన్‌లో మార్పులు చేసింది. ప్రతి టెస్ట్ ఫ్లైట్ భవిష్యత్తులో పూర్తిగా సురక్షితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన అంతరిక్ష ప్రయాణాలకు దారి తీస్తుందని సంస్థ భావిస్తోంది.








