IPL 2026: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి చవిచూడటంతో పంజాబ్ వరుసగా ఆరో పరాజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమితో జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసిపోయాయి. మిగిలిన చివరి మ్యాచ్‌లో గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మ్యాచ్ అనంతరం పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) డగౌట్‌లో ఒంటరిగా కూర్చొని తీవ్ర నిరాశలో కనిపించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోపై మాజీ భారత స్పిన్నర్ Ravichandran Ashwin స్పందిస్తూ దాన్ని “పవర్‌ఫుల్ పిక్చర్”గా అభివర్ణించాడు.
తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడిన అశ్విన్.. “టోర్నీలో టాప్-2లో నిలిచే స్థాయిలో ఉన్న జట్టు ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి చేరుకోవడం బాధాకరం. ఆటగాళ్లు, కోచ్‌లు ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచిస్తుంటారు” అని పేర్కొన్నాడు. అంతేకాకుండా పంజాబ్ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయాలపై కూడా విమర్శలు గుప్పించాడు.
ఒకే సీజన్‌లో రెండు వేర్వేరు హోమ్ గ్రౌండ్లను ఉపయోగించడం జట్టుకు నష్టమైందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ముల్లాన్‌పూర్‌లో వరుస విజయాలు సాధించిన పంజాబ్.. ధర్మశాలకు మారిన తర్వాత వరుసగా హోమ్ మ్యాచ్‌లు ఓడిపోయిందని గుర్తుచేశాడు. “ముల్లాన్‌పూర్, ధర్మశాల పిచ్‌ల స్వభావం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.” పేస్, బౌన్స్ మారిపోవడంతో అది పంజాబ్‌కే మరో అవే మ్యాచ్‌లా మారింది” అని చెప్పాడు.
ఫ్రాంచైజీ వ్యాపార ప్రయోజనాల కోసం క్రికెట్ అవసరాలను పక్కన పెట్టిందని కూడా అశ్విన్ విమర్శించాడు. “గెలవాలంటే సొంత మైదానాన్ని వదిలిపెట్టకూడదు. వ్యాపారపరంగా బాగుండొచ్చు కానీ క్రికెట్ పరంగా ఇది పెద్ద తప్పు” అని వ్యాఖ్యానించాడు.
ఇక పంజాబ్ కింగ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను Lucknow Super Giantsతో ఎకానా స్టేడియంలో ఆడనుంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఆ మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.
ALSO READ: VD Satheesan | వైభవంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం.. హాజరైన జాతీయ నేతలు








