Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి మైదానంలో తన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌ను లక్ష్యంగా పెట్టుకుని అతడు సాధన వేగం పెంచాడు. మాజీ భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో కోహ్లీ నెట్స్‌లో కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానుల్లో అతడి పునరాగమనంపై ఆసక్తి మరింత పెరిగింది. వన్డే సిరీస్‌కు ముందు ముంబై, అలీబాగ్ ప్రాంతాల్లో కోహ్లీ ప్రత్యేక శిక్షణ పొందాడు. తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన అతడు గంటల తరబడి నెట్స్‌లో సాధన చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సమయంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సంజయ్ బంగర్ మళ్లీ అతడికి సలహాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జూలై 14 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో కోహ్లీకి చోటు దక్కింది. అయితే గతంలో ఎదురైన గాయాల కారణంగా మ్యాచ్‌ల్లో ఆడే ముందు అతడు ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది.
ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభిస్తే తొలి మ్యాచ్ నుంచే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెస్టు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లీ పూర్తిగా వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి సారించాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టుకు అతడి అనుభవం కీలకమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లీ ప్రదర్శన ఎలా ఉంటుందనే అంశంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








