ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషప్రయోగ ఘటన కలకలం రేపుతోంది. ఈ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్కూల్ వంట గదిలోని తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపారని అధికారులు గుర్తించారు. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే వంట పాత్రలతోపాటు ఆహార పదార్థాల పైనా విషం చల్లినట్టు సమాచారం.
శనివారం, ఆదివారం సెలవుల సందర్భంగా వంట సిబ్బంది తాళం వేసి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం స్కూల్‌కు వచ్చి వంట సిద్ధం చేసే సమయంలో నీటిలో నురుగలు, దుర్వాసన ఉండటాన్ని గమనించి వారు అప్రమత్తమయ్యారు. వెంటనే వాటర్ ట్యాంక్‌ను పరిశీలించగా, పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించింది. సిబ్బంది చొరవతో ఆ నీరు ఎవరు తాగకుండా, భోజనానికి ఉపయోగించకుండా అపాయం తప్పించగలిగారు.
విష ప్రాయోగంతో గ్రామంలో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మధ్యాహ్న భోజనం పూర్తిగా రద్దు చేయడంతో పిల్లలకు తిండి ఇవ్వలేదు. ఈ ఘటనపై హెడ్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
పూర్తి విచారణతో నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు. స్కూల్‌లో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల సందర్శించారు. పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.