మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న ఔరంగజేబు సమాధిని రక్షించాలని మొఘల్ వారసుడిగా చెప్పుకునే యాకుబ్ హబీబుద్దీన్ ట్యూసీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు లేఖ రాశారు. సమాధి వద్ద జరిగిన నిరసనలు, విధ్వంసానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమాధి 1958 చట్టం కింద రక్షిత ప్రదేశంగా గుర్తించబడిందని, దీనిని కాపాడాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాధికారులదేనని పేర్కొన్నారు.
యాకుబ్ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం, చట్టం ప్రకారం రక్షిత స్మారక చిహ్నాల్లో అనధికార మార్పులు, నిర్మాణాలు లేదా విధ్వంసం చట్టవిరుద్ధమైనవి. అలాంటి చర్యలు చారిత్రక ప్రాముఖ్యతను నాశనం చేస్తాయని, అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటాయని అన్నారు. సినిమాలు, మీడియా వేదికల్లో చారిత్రక వ్యక్తిత్వాలపై అవాస్తవ కథనాలు ప్రజల మనోభావాలను క్షోభితుల్ని చేస్తున్నాయంటూ లేఖలో తెలిపారు.
ఛావా సినిమా విడుదల అనంతరం, ఔరంగజేబును నెగటివ్‌గా చూపినందుకు నిరసనలు ఉద్ధృతమయ్యాయి. కొన్ని వర్గాలు సమాధిని కూల్చాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. యాకుబ్ ట్యూసీ లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, అసత్య ప్రచారాలు సమాధిపై అశాంతిని రెచ్చగొట్టాయని పేర్కొన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని ధ్వంసం చేయడం వల్ల అంతర్జాతీయ బాధ్యతలు ఉల్లంఘనకు గురవుతాయని స్పష్టం చేశారు.
గత నెలలో సమాధి వద్ద జరిగిన ఘర్షణలు తీవ్రంగా మారాయి. మార్చి 17న నాగ్‌పూర్‌లో ఓ వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని తగలబెట్టారనే పుకార్లు వ్యాప్తి చెంది పరిస్థితి ఉద్రిక్తమైంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోగా, 92 మందిని అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల మధ్య యాకుబ్ యూఎన్‌కు రాసిన లేఖ చారిత్రక కట్టడాల రక్షణపై దృష్టి సారించేలా ఉంది.