Papikondalu: పాపికొండల విహార యాత్రలో శనివారం అకస్మాత్తుగా ఘటన చోటుచేసుకుంది. గోదావరిలో విహారయాత్రకు వెళ్లిన పర్యాటక బోటు సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. ఈ బోటులో 89 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నారని తెలిసింది. దేవీపట్నం సమీపంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. బోటు ఇంజిన్‌లో వచ్చిన లోపం కారణంగా అది నదిలోనే నిలిచిపోయినట్లు సమాచారం. పరిస్థితిని గమనించిన బోటు సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. తక్షణ చర్యల భాగంగా మరో బోటును ఘటన స్థలానికి పంపి అందులోని పర్యాటకులను సురక్షితంగా తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. పర్యాటకులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అదే సమయంలో నిలిచిపోయిన బోటులో సాంకేతిక మరమ్మతులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పాపికొండల వంటి ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.








