Janasena: జనసేనలో ప్రక్షాళన ప్రక్రియ మొదలైంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణకు అనుగుణంగా సంస్థాగత వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తున్న అధినేత పవన్ కళ్యాణ్, తొలిదశలో అధికార ప్రతినిధుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ తరఫున మీడియా వ్యవహారాల్లో పాల్గొంటున్న అధికార ప్రతినిధుల బాధ్యతలను పూర్తిగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జనసేనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 మంది అధికార ప్రతినిధులు ఉండగా, వారిలో 14 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. వీరంతా ఇప్పటివరకు టీవీ చర్చలు, మీడియా సమావేశాలు, రాజకీయ అంశాలపై పార్టీ వాణిని వినిపిస్తూ వచ్చారు.
అయితే పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. కొత్త అధికార ప్రతినిధుల కమిటీ ఏర్పాటు అయ్యే వరకు ఎవరూ పార్టీ తరఫున టెలివిజన్ డిబేట్లలో పాల్గొనకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే మీడియా ప్రకటనలు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో పార్టీ ప్రతినిధులుగా మాట్లాడటం కూడా నిలిపివేయాలని సూచించారు. ఈ ఆదేశాలు కొత్త కమిటీలు ప్రకటించే వరకు కొనసాగనున్నాయి.
పార్టీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణకు అనుగుణంగా బాధ్యతల కేటాయింపులో మార్పులు తీసుకురావడానికే ఈ చర్య చేపట్టినట్లు జనసేన వర్గాలు వెల్లడిస్తున్నాయి. త్వరలో కొత్త అధికార ప్రతినిధుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉండటంతో, ఈ పదవుల్లో కొత్తగా ఎవరికి అవకాశం లభిస్తుందనే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ALSO READ: Ponnam Prabhakar | గురుపూర్ణిమ వేళ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పొన్నం ప్రభాకర్








