LIVE
Wednesday, November 18, 2026
LIVE
LIVE

ONGC Gas Leak | కోనసీమ గ్యాస్ లీకేజీపై సీఎం సీరియస్.. ప్రజలను తరలించాలని ఆదేశాలు

by Bajaswamy
4 views
ONGC Gas Leak

ONGC Gas Leak: కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. భారీ శబ్ధంతో గ్యాస్ బయటకు రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో పరుగులు తీశారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ రిగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రీ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో గ్యాస్ లీక్ కావడం ప్రారంభమైంది. క్షణాల్లోనే పెద్ద మొత్తంలో గ్యాస్ వెలువడటంతో సమీప నివాస ప్రాంతాల్లో కలకలం రేగింది. అప్రమత్తమైన ఓఎన్జీసీ సిబ్బంది, పోలీసులు ప్రజలు ప్రమాద ప్రాంతానికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాద స్థలానికి దగ్గరగా ఉన్న హైవేపై వాహనాల రాకపోకలను సైతం నిలిపివేశారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఓఎన్జీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మరోవైపు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ ఘటనాస్థలాన్ని పరిశీలించి ఓఎన్జీసీ అధికారులతో చర్చించారు. లీకేజీని నియంత్రించేందుకు చేపడుతున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. మొత్తంగా, గ్యాస్ లీకేజీని పూర్తిస్థాయిలో నియంత్రించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే ప్రస్తుతం అధికారుల ముందున్న ప్రధాన లక్ష్యం.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More