Rahul Gandhi: అమెరికా వేదికగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో ఇతరులతో పోటీ పడటం కంటే, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవడమే అసలైన విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ శైలిని కూడా ప్రస్తావించారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. తన భారత్ జోడో యాత్ర అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. 4 వేల కిలోమీటర్లకు పైగా సాగిన పాదయాత్ర తనకు ప్రత్యేక రాజకీయ గుర్తింపును తీసుకొచ్చిందని వివరించారు. తనతో పోటీ పడాలనుకునే వారు కూడా 4 వేల కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందని, అలా చేస్తే తనను అనుకరిస్తున్నారనే విమర్శలు వస్తాయని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ కూడా ఇతర రాజకీయ నాయకులకు భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. పోటీలో వేగంగా పరిగెత్తడం కంటే, ఇతరులు చేయని పనిని ఎంచుకోవడమే ముఖ్యమని తన మేనల్లుడితో జరిగిన సంభాషణను గుర్తుచేశారు. రాజకీయాల్లో నిజాయితీ, మర్యాద, ప్రేమ, ఆప్యాయతలకు చోటు లేదనే అపోహలను తొలగించాలని పిలుపునిచ్చారు. నిజం చెప్పడం రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన సాధనమని వ్యాఖ్యానించారు.
