Akvan Cyclone 2026: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ క్రమంగా బలపడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉండగా, తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నవంబర్ 16న సాయంత్రం తుఫానుగా మారింది. దీనికి అక్వాన్‌గా నామకరణం చేశారు. నవంబర్ 17 ఉదయం నాటికి ఈ తుఫాన్ దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో వాయువ్య-ఉత్తర దిశగా కదులుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పున 610 కిలోమీటర్లు, శ్రీలంకలోని ట్రింకోమలీకి ఈశాన్యంగా 630 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది.
మరింత బలపడనున్న అక్వాన్
వాతావరణశాఖ అంచనాల ప్రకారం నవంబర్ 17 సాయంత్రానికి అక్వాన్ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత మరింత బలపడి నవంబర్ 19 ఉదయానికి అతి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 20 మధ్యాహ్నం సమయంలో నెల్లూరు నుంచి తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీర ప్రాంతాల వద్ద తీరాన్ని దాటే అవకాశముందని వెల్లడించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని హెచ్చరించారు.
తెలంగాణలోనూ వర్ష సూచన..
అక్వాన్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడనుంది. రాష్ట్రంలో నవంబర్ 17, 18 తేదీల్లో ప్రధానంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉండగా, నవంబర్ 19 నుంచి అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
మరోవైపు అక్వాన్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉండవచ్చని అమరావతి వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వతరవాణా శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు వాతావరణశాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి.. అక్వాన్ తుఫాన్ మరింత బలపడే అవకాశాలు ఉండటంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత.
ALSO READ: Dhoni Retirement | ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై.. CSKలో కొత్త బాధ్యతలు!
