NEET UG 2026: 2026 మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ కారణంగా పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అభ్యర్థులకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. మళ్లీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఫీజు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది.
NTA ప్రకటన ప్రకారం, మే 21, 2026 నుంచి ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు తమ చెల్లించిన పరీక్ష ఫీజును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లో లాగిన్ అయ్యి బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయడం ద్వారా రీఫండ్ పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
మళ్లీ పరీక్ష రాసే అభ్యర్థులు అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కూడా NTA తెలిపింది. ఇక నీట్ యూజీ 2026 పునఃపరీక్షను జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. భారీ సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో పరీక్ష నిర్వహణపై ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు.
అభ్యర్థుల సౌకర్యార్థం చిరునామా లేదా నివాస మార్పులు ఉన్నా వాటిని అప్‌డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. మే 21 రాత్రి 11:50 గంటల లోపు అభ్యర్థులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో మార్చుకోవచ్చని NTA తెలిపింది.
అయితే పరీక్ష కేంద్రాల కేటాయింపు నగరాల్లో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా జరుగుతుందని, అందువల్ల గతంలో ఇచ్చిన పరీక్ష కేంద్రం మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే పరీక్ష మాధ్యమాన్ని మాత్రం మార్చుకునే అవకాశం ఉండదని ఏజెన్సీ స్పష్టం చేసింది. దరఖాస్తు సమయంలో ఎంచుకున్న భాషే కొనసాగుతుందని తెలిపింది.
ఫీజు రీఫండ్, అడ్మిట్ కార్డ్ విడుదల, పరీక్ష కేంద్రం మార్పులు మరియు ఇతర అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం తనిఖీ చేయాలని NTA సూచించింది.
రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ పరిణామంతో నీట్ అభ్యర్థుల్లో స్పష్టత వచ్చిందని, పరీక్ష నిర్వహణపై ఏర్పడిన అనిశ్చితి కొంతవరకు తొలగిందని భావిస్తున్నారు.








