Popular Male Stars: వీడు ఎక్కడున్నా రాజేరా …అనే డైలాగ్ విన్నారా, ఈ డైలాగ్ తగ్గట్టు మరో సారి నిరూపించాడు మన డార్లింగ్ ప్రభాస్. ఇప్పుడు అదే మాట నిజ జీవితంలో ప్రభాస్‌కు సరిపోతుందని అభిమానులు అంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు సార్లు, రెబల్ స్టార్ ప్రభాస్ తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో ప్రభాస్‌కు ఉన్న ఆదరణ మరోసారి స్పష్టమైంది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్, డేటా అనలిటిక్స్ సంస్థ ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన “మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్” జాబితాలో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. విశేషం ఏమిటంటే, ఇది ఒకసారి కాదు.. వరుసగా నాలుగోసారి ఆయన ఈ స్థానాన్ని దక్కించుకోవడం.
ఆర్మాక్స్ మీడియా ప్రతి నెలా మరియు ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్, ఓటీటీ రంగాలకు సంబంధించిన సెలబ్రిటీల ప్రజాదరణపై సర్వేలు నిర్వహిస్తుంది. సోషల్ మీడియా ట్రెండ్స్, ప్రేక్షకుల ఆసక్తి, డిజిటల్ ఎంగేజ్‌మెంట్ వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ ర్యాంకింగ్స్ రూపొందిస్తారు. ఈ ఏడాది జాబితాలో కూడా ప్రభాస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించడం ప్రత్యేకంగా నిలిచింది.
టాప్-10 జాబితాలో టాలీవుడ్ స్టార్ల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రభాస్ మొదటి స్థానంలో ఉండగా, అల్లు అర్జున్ మూడో స్థానంలో నిలిచారు. మహేష్ బాబు ఐదో స్థానాన్ని, రామ్ చరణ్ ఏడో స్థానాన్ని దక్కించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా టాప్-10లో చోటు సంపాదించారు.
టాప్-10లో ఐదు స్థానాలను టాలీవుడ్ హీరోలు దక్కించుకోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. తెలుగు సినిమా ప్రభావం దేశవ్యాప్తంగా పెరుగుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “బాక్సాఫీస్ కింగ్ మాత్రమే కాదు.. పాపులారిటీ కింగ్ కూడా” అంటూ కామెంట్లు పెడుతున్నారు. రాబోయే భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ మరింత సంచలనాలు సృష్టిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.








