అమ్మ అమెరికాలో పెద్ద డాక్టర్, ఎన్నారై అంటూ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో తప్పుడు సమాచారంతో అమ్మాయిలను మోసం చేసే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి 2014లో బీటెక్ చదవడానికి హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే, మధ్యలోనే చదువు ఆపేసి ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్, జూదాలకు అలవాటు పడాడు. క్రమంగా మోసాల దారిలోకి వెళ్లి, ఉద్యోగాల పేరుతో జనాలను మోసం చేసిన కేసులో కూడా గతంలో అరెస్ట్ అయ్యాడు.
జైలుకు వెళ్లొచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, తన ఆదాయాన్ని సేవాకార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశాడు. దాదాపు వెయ్యి మందినుంచి డబ్బు వసూలు చేశాడు. అంతే కాకుండా ఓ ఎమ్మెల్యే ఫొటోను డీపీగా పెట్టుకుని, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడు. ఈ కేసుల్లో పలు మార్లు అరెస్టు అయినా, అతను మోసాలకు కొత్త మార్గాలు ఎంచుకున్నాడు.
తర్వాత మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా మోసాలకు తెరతీశాడు. 30 ఏళ్లు దాటిన వారిని టార్గెట్ చేస్తూ, నమ్మకాన్ని పెంచి, తన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని, కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పి డబ్బు తీసేవాడు. బాధితులు డబ్బు తిరిగి అడిగితే, వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానని బెదిరించేవాడు. కొంతమంది భయంతో మౌనం పాటించగా, జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ డాక్టర్ 11 లక్షలు మోసపోయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి, అక్కడే అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో అతడిని జైలుకు తరలించారు. పోలీసులు ఈ కేసులో మరింత విచారణ చేపట్టనున్నారు.