IPL Qualifier 2: క్వాలిఫయర్-1లో పరాజయం ఎదుర్కొన్న గుజరాత్ టైటాన్స్.. ఫైనల్ రేసులో నిలవాలంటే ఇప్పుడు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. లీగ్ చరిత్రలో మూడోసారి ఫైనల్ చేరాలనే లక్ష్యంతో జట్టు క్వాలిఫయర్-2కు సిద్ధమైంది. ఈ కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కోనుంది.
శుక్రవారం న్యూ చండీగఢ్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.
అయితే మ్యాచ్‌కు ముందు వాతావరణ పరిస్థితులు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ముల్లన్‌పూర్ ప్రాంతంలో వడగళ్ల వాన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం సమయంలో కూడా మేఘావృత పరిస్థితులు ఉండే సూచనలు ఉన్నాయి. దీంతో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా నిర్వహించలేని పరిస్థితి వస్తే ఏమవుతుందన్న చర్చ మొదలైంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్‌లకు ప్రత్యేక రిజర్వ్ డే ఉండదు.
లీగ్ రూల్స్ ప్రకారం మ్యాచ్ నిర్వహణ సాధ్యంకాకపోతే ముందుగా సూపర్ ఓవర్ నిర్వహించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా ఫలితం ఇవ్వకపోతే స్పష్టమైన విజేత తేలే వరకు వరుసగా సూపర్ ఓవర్లు నిర్వహిస్తారు.
అయితే వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారి సూపర్ ఓవర్ కూడా నిర్వహించలేని పరిస్థితి వస్తే, లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. పాయింట్లు సమంగా ఉంటే నెట్ రన్‌రేట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.








