TG20 League Final: హైదరాబాద్‌లో జరిగిన TG20 లీగ్ ఫైనల్ సందర్భంగా ప్రేక్షకులను కదిలించిన ఓ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. టోర్నమెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హాజరైన ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండను కలిసిన ఓ యువ క్రికెటర్ తన మనసులోని కోరికను వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది.
మైదానంలో విజయ్ దేవరకొండ కనిపించగానే ఆ యువ ఆటగాడు ఆయన వద్దకు వెళ్లి, “అన్నా… నేను క్రికెట్ ఆడుతున్నాను. నా కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు మీ సపోర్ట్ కావాలి” అంటూ భావోద్వేగంతో మాట్లాడాడు. మాట్లాడుతూనే అతడు కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. యువ క్రికెటర్ పరిస్థితిని గమనించిన విజయ్ దేవరకొండ వెంటనే అతడిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అతని పేరు, నేపథ్యం, క్రికెట్ ప్రయాణం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ధైర్యం కోల్పోవద్దని, కష్టపడి ప్రయత్నాలు కొనసాగించాలని ప్రోత్సహించినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ వ్యవహరించిన తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. అభిమాని భావోద్వేగాన్ని అర్థం చేసుకుని స్పందించిన ఆయన సరళత, అభిమానుల పట్ల చూపిన ఆప్యాయతపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.








