Free-Toll System: దేశవ్యాప్తంగా హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట ఇవ్వడానికి సిద్ధమవుతోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ప్రయాణం కొనసాగుతుండగానే టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్ర రవాణా శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. డిసెంబర్ 2026 నాటికి అనేక జాతీయ రహదారులపై ఈ అవరోధ రహిత టోల్ వ్యవస్థను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఫాస్టాగ్ ఉన్నప్పటికీ టోల్ బూత్ వద్ద కొంతసేపు ఆగాల్సి వస్తోంది. అయితే కొత్త విధానంలో వాహనం ఆగకుండా నేరుగా వెళ్లిపోతూ టోల్ చెల్లింపు పూర్తవుతుంది. దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
ఈ వ్యవస్థలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR), RFID ఆధారిత ఫాస్టాగ్ టెక్నాలజీలను ఉపయోగించనున్నారు. హైటెక్ కెమెరాలు వాహన నంబర్ ప్లేట్‌ను గుర్తించి, ఫాస్టాగ్ ఖాతా ద్వారా టోల్ మొత్తాన్ని కట్ చేస్తాయి. నిబంధనలు పాటించని వాహనాలకు ఈ-నోటీసులు జారీ చేసి, జరిమానాలు విధించే అవకాశముంది.
లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యమని గడ్కరీ తెలిపారు. దేశంలో రహదారి మౌలిక వసతులు మెరుగుపడటంతో రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయని చెప్పారు. కొత్త టోల్ విధానం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రయాణ అనుభవం మరింత సులభంగా మారనుంది.








