కాకినాడ రూరల్ కరప మండలం వేములవాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులకు పీపుల్స్ సేవ్ సర్వ్ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకరణాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్‌పర్సన్ పాట్నీడి పాలవేణి, మండల విద్యాశాఖ అధికారి కేబి కృష్ణవేణి విద్యార్థులకు ఈ సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా కేబి కృష్ణవేణి మాట్లాడుతూ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. పాట్నీడి పాలవేణి చేతుల మీదుగా ₹25,000 విలువైన విద్యా సామగ్రిని విద్యార్థులకు అందించారు.
ఎంఈఓ-2 పత్తి సత్యనారాయణ మాట్లాడుతూ, పరీక్షలకు ఎదుర్కొనే సమయంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా సమాధానాలు రాయాలని సూచించారు. ముందుగా సులభమైన ప్రశ్నలకు సమాధానాలు రాసి, తరువాత మిగతా ప్రశ్నలను సమగ్రంగా చదివి రాయాలన్నారు.
ఎంపీడీఓ ఎం. అనుపమ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమం తప్పకుండా స్కూలుకు హాజరై, టీచర్లు చెప్పిన పాఠాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ మహత్తర సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, ట్రస్ట్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హైస్కూల్ అధ్యాపక బృందం, గ్రామ పెద్దలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.