Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeInterNationalEbola Virus | కలకలం రేపుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తి... కాంగోలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు

Ebola Virus | కలకలం రేపుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తి… కాంగోలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు

-

Chat on WhatsApp

Ebola Virus: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్‌తో పాటు అనేక దేశాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతూ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే వైరస్‌కు కేంద్రంగా మారిన కాంగోలో పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈశాన్య కాంగోలోని బునియా నగరంలో మే 15న తొలి ఎబోలా కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే అక్కడ వైరస్ వ్యాప్తి దాదాపు రెండు నెలల ముందే ప్రారంభమై ఉండొచ్చని అంతర్జాతీయ సంస్థల పరిశీలనలో బయటపడింది.

దీంతో ఇప్పటికే ఊహించినదానికంటే ఎక్కువ స్థాయిలో వైరస్ వ్యాపించి ఉండవచ్చన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. కేసులు బయటపడినప్పటికీ నియంత్రణ చర్యలు సరిగా అమలుకావడం లేదని నివేదికలు చెబుతున్నాయి.

బాధితులను వేరుచేసి చికిత్స అందించడం, వైద్య సిబ్బంది రక్షణ చర్యలు పాటించడం వంటి అంశాల్లో లోపాలు కనిపిస్తున్నాయి. అంతేకాక శానిటైజర్లు, టెస్ట్ కిట్లు కూడా తగినంతగా లభించడం లేదని సమాచారం. ఇంధన కొరత కారణంగా రోజుకు కేవలం 20 నుంచి 40 మందికే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికా సహా కొన్ని దేశాలు ఆర్థిక సాయాన్ని తగ్గించడంతో కాంగో వైద్య వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగింది.

1976లో తొలిసారి గుర్తించిన ఎబోలా ఇప్పటివరకు కాంగోలో 17వసారి వ్యాపించగా, ఈసారి బయటపడిన రకం మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 900 కేసులు నమోదైనట్లు సమాచారం. మరణాల శాతం కూడా సుమారు 40 శాతంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అదే సమయంలో ఎబోలా బాధితుల అంత్యక్రియలు కూడా వివాదాలకు దారితీస్తున్నాయి. ప్రత్యేక జాగ్రత్తలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నప్పటికీ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆసుపత్రిపై దాడి చేసి బాధితుల మృతదేహాలను తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఇలాంటి నిర్లక్ష్య చర్యలు వైరస్ వ్యాప్తిని మరింత వేగవంతం చేసే ప్రమాదం ఉందని అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp