Bhu Bharati: తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ హక్కులను మరింత పారదర్శకంగా నమోదు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలవ్వాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. మూడు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, 2027 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రతి నెల పురోగతిని సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు.
మొదటి దశలో ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే పనులు ప్రారంభమయ్యాయని, శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్ల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. విధుల్లో చేరని సర్వేయర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.
ధరణి వ్యవస్థలో పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంపై కూడా మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుల కారణాలను పారదర్శకంగా తెలియజేస్తూ, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. అలాగే 22-ఏ జాబితాలో పొరపాటున చేరిన భూములకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కూడా సమీక్షించిన మంత్రి, మొదటి విడత ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను లబ్ధిదారులకు త్వరగా అందజేయాలని సూచించారు. రెండో విడత లబ్ధిదారుల ఎంపికలో గుడిసెల్లో నివసించే కుటుంబాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు యూనిఫాం లేక ఇబ్బంది పడకుండా, ఆగస్టు 15 నాటికి ప్రతి ఒక్కరికీ కనీసం ఒక జత దుస్తులు పంపిణీ అయ్యేలా చర్యలు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
ALSO READ: మెటా కీలక నిర్ణయం.. Meta AI Image ఫీచర్‌కు బ్రేక్








