Telangana New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అర్హులైన పేద కుటుంబాలకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి వేదిక కానుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ప్రారంభోత్సవం జరగనుంది. అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక మెమోను ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ అధికారిక వేడుకలు ముగిసిన తర్వాత, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. లబ్ధిదారుల జాబితాల ఖరారు, కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, ప్రచార ఏర్పాట్లు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి అన్ని పనులను సమయానికి పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ కార్యక్రమం ద్వారా కొత్తగా అర్హత పొందిన ప్రతి పేద కుటుంబానికి ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలు అందేలా చేయడంతో పాటు రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.








