నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో డ్రైను కాలువల ద్వారా మురుగు నీటి పారుదల సాఫీగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగాన్ని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. నగర పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించేందుకు కమిషనర్ శనివారం 5వ డివిజన్ సత్యనారాయణపురం, వైకుంఠపురం ప్రాంతాల్లో పర్యటించారు.
డ్రైను కాలువలలో నీటి పారుదల సులభతరం అయ్యేందుకు ఏర్పాటు చేసిన ఐరన్ మెష్ లను సరిచేసేలా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కాలువల్లో చెత్త వేయకుండా నివారించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పెనాల్టీలు విధించాలని ఆదేశించారు. స్థానికులు కల్వర్ట్ నిర్మాణం కోసం అభ్యర్థించగా, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖకు సూచించారు.
వైకుంఠపురం ఎస్టీ కాలనీలో మురుగు నీటిని అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అనుసంధానించే పనులను తక్షణమే చేపట్టాలని కమిషనర్ సూచించారు. స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి, వారి ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగానికి సూచనలు ఇచ్చారు.
సత్యనారాయణపురం పార్కులోని పిల్లల ఆటస్థలాన్ని పరిశీలించి, పార్కులో మట్టిని నింపి పచ్చదనాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని హార్టికల్చర్ విభాగాన్ని ఆదేశించారు. ఈ పర్యటనలో కమిషనర్‌తో పాటు డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.