అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పార్వతీ సమేత కూటేశ్వర స్వామి వారి ఆలయ పునఃనిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం శివాలయ పునః నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. గ్రామ ప్రజల సహకారంతో మహోత్సవ పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
బ్రహ్మశ్రీ యలమంచిలి కృష్ణమూర్తి శివాచార్య ఆధ్వర్యంలో, వేద పండితుల నడిపాణిలో ఐదవ రోజు పూజలు కన్నుల పండుగగా జరిగాయి. గవ్యాంతపూజ, యంత్ర మంత్ర జపాలు, గోపూజ, ధాన్యాదివాస బింబ ఉద్వాసన, ఉదకశాంతి, మూల మంత్ర హోమం, నీరాజనం, మంత్రపుష్పాది పూజా కార్యక్రమాలు ఎంతో భక్తిపరంగా కొనసాగాయి.
గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ గణపతి ఆటో ఫైనాన్స్ అధినేత సత్తి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి (దొరబాబు), సుమ దంపతులు శివమాల ధరించిన 250 మంది స్వాములకు, యాగ దంపతులకు, భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
పూజా కార్యక్రమాల్లో గ్రామస్తులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శివ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ పరిసర ప్రాంతాలు శివ నామస్మరణతో మారుమ్రోగాయి. ఆలయ పునఃప్రతిష్ఠను విజయవంతంగా ముగించేందుకు గ్రామ ప్రజలు, నిర్వాహకులు సమష్టిగా కృషి చేస్తున్నారు.