Tamil Nadu: తమిళనాడులో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం నిధుల వినియోగం, అభివృద్ధి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బలమైన ప్రభుత్వం అధికారంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రాలకు ఉదారంగా నిధులు ఇస్తున్నప్పుడు వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం చెన్నైకి కేంద్రం సుమారు రూ.14 లక్షల కోట్లు ఇచ్చిందని ఆయన వెల్లడించారు.
నిధుల వినియోగంపై ప్రశ్నలు
కేంద్రం ఇచ్చిన నిధులను సరైన విధంగా వినియోగించకుండా దారి మళ్లించడం సమంజసం కాదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అభివృద్ధి కోసం వచ్చిన నిధులు ప్రజల సంక్షేమానికి వినియోగించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
తమిళనాడుకు పూర్వ వైభవం ?
తమిళనాడుకు పూర్వ వైభవం తిరిగి రావాలంటే ఎన్డీయే కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. దేశానికి బలమైన నాయకత్వం అవసరమని, అది ప్రస్తుతం ప్రధాని మోడీ ద్వారా సాధ్యమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
సరైన నాయకులను ఎన్నుకుంటే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని చంద్రబాబు ప్రజలకు సూచించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు ఓటర్లను ఆయన కోరారు.
రాజకీయ సందేశం
ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే తమిళనాడులో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర అభివృద్ధి కొత్త దిశలో సాగుతుందని ఆయన తెలిపారు.








