Deputy CM Bhatti Vikramarka: తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లాలో మీడియాతో నిర్వహించిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఆయన ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల కేటాయింపు అంశంపై ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని కృషి చేస్తోందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకం సమర్థవంతంగా అమలవుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ పథకం కోసం ప్రతి నెలా ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. పేదలకు రూ.10 లక్షల వరకు వైద్య బీమా కవరేజ్ అందుతోందని వివరించారు. అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 10 వేల బెడ్లను పెంచుతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గం టీమ్‌గా పని చేస్తూ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలను గుర్తు చేస్తూ, ప్రభుత్వ పనితీరుకు తాను వంద శాతం మార్కులు ఇస్తానని చెప్పారు.
రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు, 2028 అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ మీటర్లు పెట్టబోమని, ఉచిత విద్యుత్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా, మ్యాపింగ్, అన్-మ్యాపింగ్ ప్రక్రియలపై మీడియా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
‘ఇందిరమ్మ జీవిత బీమా పథకం’ లబ్ధిదారులకు పెద్ద ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ఆరోపించారు. గోదాముల విధానాల్లో కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ నేతలు కేంద్రం నుంచి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత తీసుకురావాలని ఆయన సూచించారు.








