Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshAEE ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? APTRANSCO కీలక ప్రకటన

AEE ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? APTRANSCO కీలక ప్రకటన

-

Chat on WhatsApp

APTRANSCO: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీపై వస్తున్న ప్రచారాలకు ఏపీట్రాన్స్‌కో పూర్తి స్థాయిలో చెక్ పెట్టింది. నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేదని, పూర్తిగా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే ఎంపికలు జరుగుతాయని సంస్థ స్పష్టం చేసింది. సిఫార్సులు, పలుకుబడి లేదా ఇతర మార్గాల ద్వారా ఉద్యోగాలు సాధ్యమవుతాయనే ప్రచారాన్ని అధికారులు ఖండించారు. ఏపీట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (విజిలెన్స్ అండ్ హెచ్‌ఆర్‌డీ) సూర్య సాయి ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ, మొత్తం ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారానే నిర్వహిస్తామని తెలిపారు.

జాతీయ స్థాయిలో నిర్వహించే GATE, UGC-NET పరీక్షల తరహాలోనే ఈ పరీక్షలు కూడా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇటీవల సోషల్ మీడియాలో AEE పరీక్షలు వాయిదా పడతాయన్న ప్రచారం, సిలబస్ మార్పులు జరిగాయన్న వార్తలు, ఉద్యోగాల విక్రయం జరుగుతోందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే 2026 ఆగస్టు 22 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ పోస్టుల కోసం 23 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే బ్రోకర్లు, మధ్యవర్తులను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు.

పరీక్షల్లో నకిలీ అభ్యర్థులు లేదా ఇతర అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సందేహాలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీ పవర్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో 24 గంటల ఆన్‌లైన్ గ్రీవెన్స్ వ్యవస్థ అందుబాటులో ఉందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సేవలను మరింత బలోపేతం చేయడానికి ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ పోస్టులను త్వరగా భర్తీ చేయడం అవసరమని పేర్కొన్నారు.

ఇప్పటికే 200 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీ కోసం ఏపీట్రాన్స్‌కో నియామక ప్రకటన జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియ సివిల్, ఎలక్ట్రికల్, టెలికాం విభాగాల్లోని ఇంజినీరింగ్ పోస్టులకు వర్తిస్తుంది. అభ్యర్థులు జులై 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు కేంద్రాల్లో CBT పరీక్షలు నిర్వహించనున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp