Amarnath Yatra 2026: హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహను దర్శించేందుకు ఈ ఏడాది భక్తులు భారీగా తరలివస్తున్నారు. యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే లక్షన్నర మందికిపైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకోవడం విశేషం. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రత, రవాణా, వసతి ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేస్తున్నారు. యాత్రలో భాగంగా గురువారం జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి 8,796 మంది భక్తులతో కూడిన తొమ్మిదో కాన్వాయ్ కశ్మీర్ లోయ వైపు బయల్దేరింది.
వీరిలో కొందరు బల్తాల్ మార్గం, మరికొందరు సంప్రదాయ పహల్గామ్ మార్గం ద్వారా పవిత్ర గుహకు చేరుకోనున్నారు. యాత్రికుల రక్షణ కోసం ప్రత్యేక భద్రతా బలగాల పర్యవేక్షణలో వాహనాలను పంపించారు. ఈసారి యాత్రలో పురుషులు, మహిళలు, సాధువులు, చిన్నారులు, విదేశీయులు, ట్రాన్స్‌జెండర్ భక్తులు కూడా పాల్గొనడం విశేషంగా నిలిచింది.
యాత్రకు వస్తున్న భక్తుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు. శ్రీనగర్ సమీపంలోని యాత్రి శిబిరాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పెరుగుతున్న యాత్రికుల రాకతో జమ్మూకశ్మీర్ పర్యాటక రంగానికి, స్థానిక వ్యాపారులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో తయారయ్యే చేతివృత్తి, చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు.
అయితే యాత్ర నేపథ్యంలో నకిలీ రిజిస్ట్రేషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో నలుగురు స్థానిక ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించారు. యాత్రికులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర మొత్తం 56 రోజుల పాటు కొనసాగనుంది. శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ రోజున యాత్ర ముగియనుండగా, చివరి వరకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.








