వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనిపై ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ. 2.20 కోట్లు వసూలు చేశారన్న కేసు ఆమెపై నమోదైంది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, రజని మరిది విడదల గోపి, పీఏ దొడ్డ రామకృష్ణ కూడా నిందితులుగా ఉన్నారు.
తాజాగా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం జిల్లా ఎస్పీకి రజని, ఆమె మరిది విడదల గోపిపై ఫిర్యాదు చేశారు. 2022లో తన ఇంటిపై దాడి చేయించారని, తనను తీవ్రంగా వేధించారని ఆరోపించారు. దాదాపు 100 మంది తన ఇంటిపై దాడి చేసి, కారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, నామమాత్రపు కేసు మాత్రమే పెట్టారని తెలిపారు. ఇప్పుడు ఈ ఫిర్యాదును న్యాయపరంగా విచారించి రజని, గోపి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని ఎస్పీని కోరారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఉన్న కేసుల కారణంగా విడదల రజని రాజకీయ భవిష్యత్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.