Hyderabad Rain Alert: హైదరాబాద్‌లో ఇటీవల తగ్గిన వర్షాల నేపథ్యంలో నగరవాసులకు భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త తెలిపింది. శనివారం వరకు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. ఈ వర్షాలతో ప్రస్తుతం ఉన్న వర్షపాతం లోటు కొంత మేర భర్తీ అయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నైరుతి రుతుపవనాల సీజన్‌లో హైదరాబాద్‌లో ఇప్పటివరకు 313.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 277.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యాయి. దీంతో సుమారు 12 శాతం వర్షపాతం లోటు కొనసాగుతోంది. రానున్న వర్షాలు ఈ లోటును తగ్గించడమే కాకుండా జలాశయాల్లో నీటి నిల్వలను కూడా పెంచే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (TGDPS) గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం దాదాపు సాధారణ స్థాయిలోనే ఉంది. రాష్ట్రంలో సాధారణంగా 402.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 379 మిల్లీమీటర్లు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 581 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి.
వచ్చే కొద్ది రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.








