Professor Jayashankar: తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమానికి మార్గదర్శకుడైన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఆవిర్భావానికి జయశంకర్ సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. “పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా తెలంగాణది” అనే భావాన్ని తన జీవితాంతం ఆచరణలో చూపించిన మహనీయుడు జయశంకర్ సార్ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన అరుదైన వ్యక్తిత్వమని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు జయశంకర్ సార్ గురుతుల్యులని, ఉద్యమానికి సిద్ధాంత బలాన్ని అందించిన మహోన్నత మేధావిగా నిలిచారని అన్నారు.
తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో విస్తరించి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి చైతన్యం కలిగించిన దిక్సూచి జయశంకర్ సార్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ సార్ పేరును పెట్టి గౌరవించిందని గుర్తుచేశారు. తెలంగాణ చరిత్రలో జయశంకర్ సార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కేటీఆర్ తన నివాళిలో పేర్కొన్నారు.