కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) నుంచి భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్‌కు ఊరట లభించింది. గతంలో సోషల్ మీడియా సహా వివిధ వేదికల్లో అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంగా విధించిన మూడేళ్ల నిషేధాన్ని ఇప్పుడు అధికారికంగా రద్దు చేశారు. ఈ అంశంపై బుధవారం (జూలై 1, 2026) జరిగిన ప్రత్యేక సాధారణ సమావేశంలో కేరళ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశాంత్ సమర్పించిన బేషరతు క్షమాపణ పత్రాన్ని సభ్యులు విస్తృతంగా చర్చించిన అనంతరం, నిషేధాన్ని తొలగించేందుకు అంగీకరించారు.
అయితే భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిషేధాన్ని ఎత్తివేస్తున్నప్పటికీ, నియమాలను గౌరవించాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేసింది. ఈ నిర్ణయంతో కేరళ క్రికెట్ లీగ్ (KCL) సీజన్-3లో ‘ఏరీస్ కొల్లాం సేలర్స్’ ఫ్రాంచైజీకి కో-ఓనర్‌గా శ్రీశాంత్ తిరిగి తన పాత్రను కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఆయన క్రికెట్ పరిపాలనా రంగంలో మళ్లీ చురుకుగా పాల్గొనే అవకాశం పొందారు.
Sreesanth | మాజీ పేసర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేత.. కేరళ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం
-








