అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, చమురు కొరత ప్రభావంతో రూపాయి విలువ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో రూపాయి విలువ తగ్గుదలపై మాజీ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పణగరియ( Arvind Panagariya) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సహజ ప్రక్రియేగా చూడాలని అయన తెలిపారు.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.100కు చేరడం అనేది ఎక్కువగా మానసిక భావన మాత్రమేనని పణగరియ పేర్కొన్నారు.
చమురు దిగుమతుల ఒత్తిడి కారణంగా తాత్కాలికంగా రూపాయి బలహీనపడవచ్చని, అయితే పరిస్థితులు సాధారణ స్థితికి చేరిన తర్వాత రూపాయి తిరిగి కోలుకునే అవకాశం ఉందన్నారు.రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతుల వ్యయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అదే సమయంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
విదేశీ పెట్టుబడులు పెరగడం ద్వారా రూపాయి పతనం వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీ చేయవచ్చని వివరించారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. ప్రస్తుత చమురు సంక్షోభం కొన్ని నెలల నుంచి ఏడాది వరకు కొనసాగితే ప్రారంభంలో రూపాయి మరింత బలహీనపడవచ్చని అంచనా వేశారు.
అయితే తరువాత విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. అదే సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే భారత విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు అధిక వడ్డీతో ఎన్నారై డిపాజిట్లు లేదా డాలర్లలో సార్వభౌమ బాండ్లపై అధికంగా ఆధారపడకూడదని RBIకి సూచించారు.
2013 కరెన్సీ సంక్షోభంతో పోలిస్తే ప్రస్తుతం భారత ఆర్థిక పరిస్థితి బలంగా ఉందని పణగరియ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆర్బీఐ ద్రవ్య విధానాల కారణంగా ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని పేర్కొన్నారు.








