విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) ఏదో ఒక ట్వీట్ తో సోషల్ మీడియా మాధ్యమాలో నిలుస్తూనే ఉంటాడు. అలాగే ఇప్పుడు అయన చేసిన ట్వీట్ సంచలంగా మారింది. ప్రముఖ పాప్ సంగీత దిగ్గజం మైఖేల్ జాక్సన్(Michael Jackson) కు భావోద్వేగభరిత నివాళి అర్పించారు. ఇటీవల విడుదలైన మైఖేల్ బయోపిక్‌ను చూసిన అనంతరం ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు చేశారు.
జాక్సన్ మరణం ఇప్పటికీ తనను తీవ్రంగా కలచివేస్తుందని, అతడు కూడా సాధారణ మనిషేనని నిరూపించుకున్నందుకు తనకు బాధ కలిగిందని వర్మ తనదైన శైలిలో పేర్కొన్నారు. 2009 జూన్ 25న మైఖేల్ జాక్సన్ మరణవార్త చూసిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, “టీవీలో ‘మైఖేల్ జాక్సన్ ఈజ్ డెడ్’ అని కనిపించగానే అది నిజం కాదనుకున్నాను. కానీ ప్రతి ఛానల్‌లో అదే వార్త రావడంతో ఆ షాక్‌ను అంగీకరించాల్సి వచ్చింది” అని వర్మ తెలిపారు.
అలాగే 1984లో విజయవాడలో తన ఇంజనీరింగ్ కాలం నాటి ఓ జ్ఞాపకాన్ని కూడా పంచుకున్నారు. ఓ స్నేహితుడు బలవంతంగా తీసుకెళ్లిన వీడియో పార్లర్‌లో ‘థ్రిల్లర్’ వీడియో చూసిన అనుభవం తన జీవితాన్ని మార్చేసిందని చెప్పారు. “అది కేవలం పాట కాదు, డ్యాన్స్ కాదు.. ఒక విప్లవం. జాక్సన్ మనిషిలా కదలలేదు. అతడు మానవాతీత శక్తిలా కనిపించాడు” అంటూ ఆయన అభివర్ణించారు.
Billie Jean, Smooth Criminal, Black or White వంటి పాటలు తన సినిమా పాటల చిత్రీకరణకు పెద్ద ప్రేరణగా నిలిచాయని ఆర్జీవీ తెలిపారు. తన కెరీర్‌లో ప్రతి పాట చర్చలో మైఖేల్ జాక్సన్ ప్రస్తావన వచ్చేదని గుర్తుచేసుకున్నారు.
జాక్సన్ చుట్టూ వచ్చిన వివాదాలను తాను ఎప్పుడూ పట్టించుకోలేదని, కళాకారుడిగా ఆయన ఇచ్చిన అనుభూతి ముందు అవన్నీ చిన్నవేనని వర్మ అన్నారు. చివరగా “నువ్వు ఎక్కడ ఉన్నా గెలాక్సీల మధ్య మూన్‌వాక్ చేస్తూనే ఉంటావు” అంటూ తన భావోద్వేగ పోస్టును ముగించారు.








