భారత క్రికెట్లో మరోసారి పెద్ద చర్చకు దారి తీసే వ్యాఖ్యలు వెలువడ్డాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), జట్టు మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మయాంతి లాంగర్‌తో మాట్లాడిన కోహ్లీ, తనపై జరుగుతున్న కమ్యూనికేషన్లో స్పష్టత లేకపోవడంపై ఘాటుగా స్పందించాడు.
“నా వల్ల జట్టుకు ఉపయోగం ఉంటుందా లేదా నేరుగా నా ముఖం మీదే చెప్పండి. అలా కాకుండా ఒకసారి నమ్మకం ఉందని, మరోసారి ప్రశ్నలు వేస్తూ ఉంటే నేను ఆ పరిస్థితిలో ఉండలేను” అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. తాను ఎప్పుడూ తన ఆటపై, ప్రిపరేషన్‌పై నిజాయితీగా ఉంటానని పేర్కొన్నాడు.
2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీ, తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే తన నిర్ణయాల వెనుక మేనేజ్మెంట్తో ఉన్న అస్థిర కమ్యూనికేషన్ కూడా కారణమని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వారానికి ఒకసారి ఒక మాట చెప్పి, తర్వాత వారం దానికే విరుద్ధంగా మాట్లాడటం సరైన విధానం కాదు. నాకు అవసరం లేదనుకుంటే ముందే చెప్పాలి. అవసరం ఉందంటే స్థిరంగా ఉండాలి” అని కోహ్లీ పేర్కొన్నాడు.
అయితే ఇటీవల వన్డేల్లో అద్భుత ఫామ్ కొనసాగిస్తూ, దేశీయ టోర్నీల్లో కూడా పాల్గొంటూ తన స్థిరతను మరోసారి నిరూపించాడు. కోహ్లీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.








