Nasha Mukt Bharat Yatra: డ్రగ్స్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు టాలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగారు. యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న మత్తుపదార్థాలపై పోరాటానికి తన వంతు చేయూత అందించేందుకు ముందుకొచ్చారు విక్టరీ వెంకటేష్. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్‌ను ప్రత్యేకంగా కలిసిన కిషన్ రెడ్డి.. యాత్రలో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేయడమే కాకుండా కుటుంబాలను సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. మత్తుపదార్థాల వ్యసనాన్ని అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ఇలాంటి ప్రజా ఉద్యమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్’ పిలుపుతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్య సాధనలో భాగంగా ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని పేర్కొంటూ.. తల్లిదండ్రులు, విద్యార్థులు, యువతతో పాటు హైదరాబాద్ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవడమే ఈ యాత్ర ఇచ్చే సందేశం.
ALSO READ: PM Modi speech | సవాళ్లను ఎదుర్కోవాలి.. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది: మోడీ
