కోవిడ్-19 మహమ్మారి మానవాళిపై చూపిన ప్రభావం తగ్గకముందే, మరో పెద్ద ముప్పు ముంచుకురావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఇది ఒకటి కాదు, తప్పనిసరిగా మరో మహమ్మారి వస్తుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘ్యాబ్రియేసస్ తెలిపారు. జెనీవాలో జరిగిన పాండమిక్ ఒప్పంద సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
టెడ్రోస్ మాట్లాడుతూ “మహమ్మారి రావడం ఒక సిద్ధాంతం కాదు, ఇది శాస్త్రీయంగా ఖచ్చితమైనదే” అన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణించారని, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయని గుర్తు చేశారు. కొత్త మహమ్మారి రేపే రావచ్చు లేదా మరో రెండు దశాబ్దాలు పడవచ్చు కాని తప్పదని చెప్పారు.
1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ వల్ల 50 మిలియన్ల మంది మరణించారని, అదే విధంగా కోవిడ్-19 కారణంగా అధికారికంగా 70 లక్షల మంది చనిపోయినా వాస్తవ సంఖ్య 2 కోట్లు ఉన్నట్టు అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోవిడ్ వల్ల 10 ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని చెప్పారు.
మహమ్మారి ఒప్పందంపై దేశాల మధ్య ఏకాభిప్రాయం రావాలని టెడ్రోస్ ఆకాంక్షించారు. ఈ ఒప్పందం ఏ దేశ సార్వభౌమాధికారాన్ని తాకలేదని, అంతర్జాతీయ సమన్వయానికి ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ప్రపంచం అంతా కలిసికట్టుగా ఉండాలన్న సంకేతం అవసరమని, ముందుగా సిద్ధంగా ఉంటేనే ముప్పును తట్టుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక చెబుతోంది.