వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పోలీసుల మధ్య తీవ్ర ఆందోళన కలిగించాయి. ఆయన “అధికారంలోకి వచ్చాక పోలీసుల బట్టలు ఊడతీస్తాం” అని వ్యాఖ్యానించగా, శ్రీసత్య సాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ దానికి గట్టిగా స్పందించారు.
“ఈ యూనిఫాం మేము జేబులో పెట్టుకోలేదు. ఎన్నో కష్టాలు పడి, పరీక్షలు రాసి, శారీరకంగా ట్రైనింగ్ పూర్తిచేసి, వేల మందిలో నెగ్గి వచ్చాం. ఎవడైనా వచ్చి ఊడదీయడానికి ఇది అరటితొక్క కాదు. మాటలు మింగుడు పడేలా ఉండాలి” అని ఆయన హెచ్చరించారు.
తమకు విధేయత ప్రజల పక్షాన ఉంటుందని, నిజాయితీగా పనిచేసే ఉద్యోగులుగా ఎప్పుడూ ప్రజాసేవలో ఉంటామని ఎస్‌ఐ తెలిపారు. యూనిఫాం అంటే గౌరవం, ఆ గౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడే వారు సమాజాన్ని దిక్కుమాలిన దిశకు తీసుకెళ్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార మార్పుల పేరిట ఉద్యోగులను బెదిరించడం, అపహాస్యం చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఏ రాజకీయ నాయకుడైనా సామాన్యులుగా మాట్లాడకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ సూచించారు. “జాగ్రత్తగా మాట్లాడు” అనే మాటతో ఆయన తన ఘాటు స్పందన ముగించారు.