బీహార్‌లో మరోసారి గెలిచిన తర్వాత మా టార్గెట్ బెంగాల్ అని ప్రధాని మోదీ, అమిత్ షా సవాల్ చేశారు. వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి తీవ్ర పోటీగా మారనున్నాయి. వరుసగా మూడు సార్లు విజయం సాధించిన మమతా బెనర్జీ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ, నాలుగోసారి గెలుపు అంత సులభంగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో కమ్యూనిస్టుల్ని ఓడించి అధికారంలోకి వచ్చిన మమతా, ఆ పార్టీని క్రమంగా బలహీనపరిచినా, ఆ ఖాళీని బీజేపీ భర్తీ చేసింది.
2016లో కేవలం 10% ఓట్లు ఉన్న బీజేపీ, 2019లో 40% కు పెరిగింది. 2021 అసెంబ్లీ, 2024 లోక్‌సభలో కూడా అదే శాతాన్ని నిలబెట్టుకుంది.
కమ్యూనిస్టు శ్రేణుల్లోని అసంతృప్తి, గ్రామీణ స్థాయిలో జరిగిన ఘర్షణల వల్ల కొందరు బీజేపీ వైపు మొగ్గుచూపడం ఆ పార్టీకి బలం చేకూర్చింది.
ALSO READ:Lokesh Praises Govt Teacher | కౌసల్య టీచర్ వినూత్న బోధనపై మంత్రి నారా లోకేశ్ ఫీదా
మరోవైపు, మమతా బెనర్జీ గ్రామీణ నెట్‌వర్క్, ముస్లిం ఓటు బ్యాంకుపై ఆధారపడుతున్నారు. అయితే పదిహేనేళ్ల పాలనపై ఉన్న వ్యతిరేకత ఆమెకు సవాల్‌గా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీ ఇప్పటికే రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి ప్రతి జోన్‌కు కీలక నేతలను నియమించగా, రాబోయే ఎన్నికల్లో మమతాకు బలమైన పోటీ తప్పదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
