ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి అందివచ్చిన పంట నీటమునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరి, మిర్చి, మామిడి తోటలు భారీ నష్టాన్ని చవిచూశాయి.
వాతావరణశాఖ తాజా హెచ్చరికల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. తమిళనాడు నుంచి విదర్భ వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈదురుగాలులు, పిడుగుల ప్రభావం అధికంగా ఉంటుందని, చెట్లకు దూరంగా ఉండాలని, అవసరం లేకపోతే బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది. రైతులు తమ పంటను రక్షించుకోవడానికి అధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు తగిన పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. విపత్తు సమయంలో రైతులకు అవసరమైన ఆర్థిక, వ్యవసాయ సహాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.