ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి తిర్యాణి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. కొన్ని గ్రామాల్లో బోరుబావులు పాడైపోయాయి. మరికొన్ని చోట్ల బావులు అడుగంటడంతో నీటి కొరత ఉధృతమవుతోంది. మిషన్ భగీరథ ప్రాజెక్టు ఉన్నా, నిర్వహణ లోపాల వల్ల పైపులైన్‌లు పని చేయడం లేదు. ఫలితంగా గ్రామస్తులు తినడానికి, తాగడానికి కూడా నీరు లేక అవస్థలు పడుతున్నారు.
గుండాల, మంగీ, తాటిగూడ, లంబాడీ తండాలు, భీంరాళ్ల వంటి గ్రామాల్లో ప్రజలు ఎడ్లబండ్లు లేదా నడక మార్గంలో వాగుల వరకూ వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. పలు గ్రామాల ప్రజలు ఒకే బావిని ఆధారంగా చేసుకుంటుండటంతో నీటి సరఫరా సరిపోవడం లేదు. పనులన్నీ వదిలేసి నీటి కోసం చిన్నా పెద్దా తేడా లేకుండా పరుగులు పెడుతున్నారు. ఎండలు పెరిగే కొద్దీ వాగుల్లో నీటి లభ్యత తగ్గిపోవడంతో పరిస్థితి మరింత ఘోరంగా మారింది.
చెళ్లి బయటపడే నీటిని తెచ్చుకునేందుకు కొన్ని కుటుంబాలు పొద్దున్నే లేచి మూడు నాలుగు కిలోమీటర్లు నడిచే పరిస్థితి. చెలిమెల ఊట వచ్చేంతవరకూ వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. మురుగు నీటిని కూడా తాగాల్సిన పరిస్థితికి చేరుకుంటున్నామంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాలకు కూడా నీరు అందక ఇబ్బంది పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మొర్రిగూడకు చెందిన కుడిమెత మారుబాయి మాట్లాడుతూ, బోర్లు లేకపోవడంతో పక్క ఊర్లో బావి నుంచి నీరు తెచ్చుకుంటున్నామని, అది చాలక వాగుల వరకూ నడవాల్సి వస్తోందని చెప్పారు. మరోవైపు, వాగు ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందని, ఉదయం నుంచే వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని కొందరు తెలిపారు. మిషన్ భగీరథ పైపులైన్‌ల మరమ్మతులకే వారు ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు.