బీఆర్‌ఎస్ హయాంలో చీరెల ఆర్డర్లతో ఉత్సాహంగా సాగిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కుదేలైపోయింది. బతుకమ్మ చీరెల ఆర్డర్లు నిలిపివేయడంతో వేలాది నేతన్నలు ఉపాధి కోల్పోయారు. దాంతో 30 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కార్మికులు ప్రభుత్వాన్ని వేడించినా, స్పందన లేక పోవడంతో చివరికి పోరుబాట పట్టారు. కొంతకాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు చీరెల ఆర్డర్లు ఇవ్వడంతో ఉపాధి తిరిగి దక్కింది కానీ, కూలీ రేట్లు మాత్రం నిర్ణయించలేదు.
ప్రభుత్వం యజమానులకు మీటరుకు రూ.32.50 చెల్లించేందుకు అంగీకరించినా, కార్మికులకు మాత్రం ఏ కూలీ రేటూ ప్రకటించలేదు. పదిహేను రోజులుగా పని చేస్తున్న నేతన్నలకు పైసలు మాత్రమే ఇస్తూ అనామతగా వదిలేస్తున్నారు. పనికి తగ్గ వేతనం లేకపోవడంతో కార్మికులు ఆందోళన మొదలుపెట్టారు. బతుకమ్మ చీరెల కన్నా ఎక్కువ పని ఉన్నా తక్కువ కూలీ వస్తోందని ఆరోపిస్తున్నారు. సబ్సిడీ కూడా రద్దు కావడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది.
కార్మికులు వేతనాలు పెంచాలని కోరుతూ సమ్మెకు దిగారు. ఆరు రోజులుగా సమ్మె కొనసాగుతుండగా, అధికారులు, పాలకులు స్పందించకపోవడం నిరాశకు గురి చేసింది. దీనితో 24 గంటల నిరాహార దీక్షల పంథాలోకి వెళ్లారు. అంబేద్కర్ చౌరస్తాలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వందలాది మగ్గాలు నిలిచిపోయాయి, ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం కార్మికులను మరింత కలచివేసింది.
నేతన్నలు వేదికపై స్పష్టంగా ప్రభుత్వానికి సూచనలిచ్చారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరెల మాదిరిగా స్వయం సహాయక సంఘాల చీరెల తయారీకి కూడా కూలీ రేట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే యారన్ సబ్సిడీ మళ్లీ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నేతన్నల సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.