CM Vijay: తమిళనాడు రాజకీయ చరిత్రలో గొప్ప విజయం సాధించి డీఎంకే కోటపై జెండా ఎగురవేసిన నటుడిగా పేరుగాంచిన జోసెఫ్ విజయ్, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా తన పాలనా శైలితో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అయన తర్వాత చూపిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన అధికార వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విజయ్ ప్రతిరోజూ నిర్దేశిత సమయానికి ముందుగానే సచివాలయానికి చేరుకుంటున్నారు. వీవీఐపీ లాంచ్ ప్రోటోకాల్స్‌కు స్వస్తి పలికి, ఇంటి నుంచే స్వయంగా లంచ్ బాక్స్ తీసుకువస్తూ సాధారణ జీవనశైలిని కొనసాగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన విరామంలో బయటకు వెళ్లకుండా తన ఛాంబర్‌లోనే భోజనం ముగించి వెంటనే అధికారిక పనుల్లో నిమగ్నమవుతున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదల, ఎన్నికల హామీల అమలు కోసం అవసరమైన నిధుల సమీకరణపై ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఆయన పని తీరు సచివాలయ వర్గాల్లో వేగాన్ని పెంచిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇక మరోవైపు, చెన్నై నగర ట్రాఫిక్ వ్యవస్థలో సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం ప్రజల్లో మంచి స్పందన పొందుతోంది. సాధారణంగా సీఎం కాన్వాయ్ ప్రయాణ సమయంలో రహదారులు పూర్తిగా మూసివేయడం ఆనవాయితీగా ఉండగా, దానికి ఆయన బ్రేక్ వేశారు.
కొత్త విధానం ప్రకారం సీఎం కాన్వాయ్ కేవలం ఒకే లైన్లో మాత్రమే ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. మిగిలిన రెండు లైన్లలో ప్రజల వాహనాలు యథావిధిగా కొనసాగుతాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.
అదనంగా, చెన్నైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సీఎం ఉదయం చాలా ముందుగానే అధికారిక కార్యక్రమాలకు బయలుదేరుతున్నారు. ఈ నిర్ణయాలు సామాన్య ప్రజల నుంచి మాత్రమే కాకుండా ఐఏఎస్ వర్గాల్లో కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి.
Sourceone india telugu.com








