ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్న భారీ అంతరిక్ష నౌక ‘స్టార్‌షిప్ V3’( SpaceX Starship V3) తొలి ప్రయోగంలో కీలక విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా గుర్తింపు పొందిన ఈ వాహనం టెక్సాస్‌లోని స్టార్‌బేస్ కేంద్రం నుంచి విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
2025 అక్టోబర్ తర్వాత స్టార్‌షిప్ సిరీస్‌కు ఇది తొలి ప్రయోగం కావడం విశేషంగా మారింది. భవిష్యత్ చంద్రుడు, మంగళ గ్రహ యాత్రల కోసం రూపొందిస్తున్న తదుపరి తరం స్పేస్ వాహనాల్లో స్టార్‌షిప్ V3ను అత్యంత కీలక ప్రాజెక్టుగా భావిస్తున్నారు.
ఈ కొత్త వెర్షన్‌ను గత మోడళ్లతో పోలిస్తే మరింత ఆధునిక సాంకేతికతతో రూపొందించారు. ‘సూపర్ హెవీ’ బూస్టర్ మరియు ‘షిప్’ అప్‌పర్ స్టేజ్ కలిపి పనిచేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ప్రయోగ సమయంలో 33 రాప్టర్ ఇంజిన్‌లలో ఒకటి సాంకేతిక సమస్యతో ఆగిపోయినా, మొత్తం మిషన్‌పై పెద్ద ప్రభావం పడలేదు.
అలాగే ‘షిప్ 39’లోని ఆరు ప్రధాన ఇంజిన్‌లలో ఒకటి ప్రయాణం మధ్యలో నిలిచిపోయినప్పటికీ, వాహనం నిర్దేశిత కక్ష్యను విజయవంతంగా చేరుకుంది. ఈ మిషన్‌లో మొత్తం 22 పేలోడ్‌లను తీసుకెళ్లారు. వాటిలో 20 డమ్మీ స్టార్‌లింక్ ఉపగ్రహాలు కాగా, రెండు అసలు ఉపగ్రహాలు ప్రత్యేక పరీక్షల కోసం ఉపయోగించారు.
ప్రయోగం తర్వాత సుమారు 50 నిమిషాలకే వాహనం భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఈ దశలో రాకెట్ చుట్టూ భారీ ప్లాస్మా వెలుగులు కనిపించాయి. రీఎంట్రీ సమయంలో నిర్మాణ బలం, నియంత్రణ వ్యవస్థలను పరీక్షించేందుకు పలు ప్రత్యేక విన్యాసాలు నిర్వహించారు.
సాంకేతిక సమస్యలు ఎదురైనా, పేలోడ్ విడుదల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. ముఖ్యంగా స్టార్‌లింక్ ఉపగ్రహాల ద్వారా హీట్ షీల్డ్ టైల్స్ పనితీరును పరిశీలించడం ఈ ప్రయోగంలోని ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక ముందున్న దశలో నాసా అనుమతులతో వ్యోమగాములను తీసుకెళ్లే సామర్థ్యాన్ని స్టార్‌షిప్ V3కు కల్పించేందుకు స్పేస్‌ఎక్స్ సిద్ధమవుతోంది. భవిష్యత్ అంతరిక్ష పరిశోధనల్లో ఈ వాహనం కీలక పాత్ర పోషించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.








