తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ కేసులో నెల్లూరు రైల్వే న్యాయస్థానానికి హాజరైన సందర్భంగా, మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి, “కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తి నెల్లూరులో పుట్టి పెరగడం జిల్లా ప్రజల భాగ్యంగా కాదు, శాపంగా మారింది” అని వ్యాఖ్యానించారు.
వైసీపీ హయాంలో అసెంబ్లీ వేదికగా మహిళలపై దూషణలకు పాల్పడ్డ వాళ్లను వైఎస్ జగన్ తగినంతగా ఖండించకపోవడం వల్లే పార్టీకి నష్టమయ్యిందని సోమిరెడ్డి అన్నారు. “అప్పుడు వాళ్లను అణచి పెట్టి ఉంటే పార్టీకి 11 సీట్లే కాదు, మరో నాలుగు వచ్చి ఉండేవి,” అని అభిప్రాయపడ్డారు. జగన్ వెంట వెకిలిగా నవ్వుతూ కూర్చోవడం బాధాకరమన్నారు.
కాకాని గోవర్ధన్ రెడ్డి తన నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సోమిరెడ్డి, “ఆయనపై కేసులు నమోదైయినా పోలీసుల విచారణకు హాజరు కావడం లేదు. తప్పించుకుంటూ తిరుగుతున్నారు,” అని విమర్శించారు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
తనపై 18 తప్పుడు కేసులు నమోదైనప్పటికీ తాను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదని సోమిరెడ్డి తెలిపారు. అన్ని కేసులకు చట్టపరంగా హాజరై పోరాడుతున్నానని, నిజం ఎప్పటికీ వెలుగులోకి వస్తుందని అన్నారు. వైసీపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన బుద్ధి చెప్పే అవకాశం వస్తుందని స్పష్టం చేశారు.