Araku Coffee: భారతీయ కాఫీకి ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ప్రత్యేక బహుమతిని అందించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు అందించిన ‘కాఫీ ఆఫ్ ఇండియా’ గిఫ్ట్ బాక్స్‌లో దేశంలోని ఎన్నో ప్రముఖ కాఫీ రకాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయలో పండే ప్రసిద్ధ అరకు కాఫీకి కూడా స్థానం కల్పించడం విశేషంగా మారింది.
అరకు కాఫీకి ఈ ప్రాధాన్యం దక్కడం పట్ల తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆనందం వ్యక్తం చేశారు. గిరిజన రైతుల కష్టానికి ఇది లభించిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అరకు బ్రాండ్ విలువను పెంచడంలో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ గిఫ్ట్ బాక్స్‌కు సంబంధించిన చిత్రాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్నారు.
భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే కాఫీ గింజలు ప్రత్యేకమైన వాతావరణం, నేల స్వభావం, ప్రాసెసింగ్ విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయని ఆయన వివరించారు. భారత కాఫీ నాణ్యతను ప్రపంచానికి పరిచయం చేసే ప్రతీకగానే ‘కాఫీ ఆఫ్ ఇండియా’ బాక్స్‌ను రూపొందించినట్లు తెలిపారు. అరకు కాఫీ ఇప్పటికే తన ప్రత్యేక రుచి, సువాసనతో దేశ విదేశాల్లో మంచి పేరు సంపాదించుకుంది.
ఇప్పుడు ప్రధాని అందించిన ఈ ప్రతిష్ఠాత్మక బహుమతిలో చోటు దక్కడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో అరకు కాఫీకి మరింత ప్రచారం లభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల గిరిజన రైతులకు ఆర్థికంగా కూడా మేలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








