కర్ణాటక రాజకీయాల్లో కొనసాగిన అనిశ్చితికి ఎట్టకేలకు ముగింపు లభించింది. సిద్ధరామయ్య (Siddaramaiah) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మే 28న బెంగళూరులోని తన అధికారిక నివాసంలో జరిగిన మంత్రుల అల్పాహార సమావేశంలో సిద్ధరామయ్య ఈ విషయాన్ని కేబినెట్ సహచరులకు వెల్లడించారు.
ఆయన లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నాయకత్వ మార్పుపై అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో చర్చలు జరిగాయి.
రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో మార్పుకు సిద్ధమైతే సిద్ధరామయ్యకు కేంద్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు లేదా రాజ్యసభ అవకాశం ఇవ్వనున్నట్లు హైకమాండ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాల తర్వాతే ఆయన రాజీనామాకు అంగీకరించినట్లు తెలుస్తోంది.








